ఉత్తరాఖండ్ వరద బీభత్సం... 50 మంది మృతి...
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వరదల వల్ల 50 మంది మృత్యువాత పడ్డారు. 160 భవనాలు నీటి కోతకు గురై కొట్టుకుపోయాయి. ఇక ద్విచక్రవాహనాలు, కార్లు సైతం వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. కొండచరియలు విరిగిపడి, వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయి వందలమంది యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు.
గమ్యం చేరుకునే దారి లేక, తిండి లేక అల్లాడిపోతున్నారు. మన రాష్ట్రానికి చెందిన వారు కూడా ఈ వరదల్లో చిక్కుకుపోయారు. నెల్లూరు జిల్లాకు చెందినవారు మాత్రం తాము సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం అందించారు. మిగిలిన ప్రాంతాల వారి పరిస్థితి ఎలా ఉన్నదో అని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం చేతులెత్తేసింది. ఉత్తర కాశీ, గంగోత్రి వంటి ప్రాంతాలతో అసలు తమకు సంబంధాలు లేకుండా పోయాయనీ, సహాయక చర్యలు చేపడదామన్నా వాతావరణం అనుకూలంగా లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు. దీంతో ఆందోళన మరింత పెరిగిపోతోంది.
ఇంకోవైపు బాధితులను రక్షించేందుకని హెలికాఫ్టర్లో వెళ్లిన ఏడుగురు సిబ్బంది హెలికాఫ్టర్ తో సహా గల్లంతయ్యారు. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు తీవ్ర అంతరాయ ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల నివారణ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Tags: Telugu News, News, AP News
0 comments:
Post a Comment