ప్రకృతి వైపరీత్యంతో వరదల్లో చిక్కుకుని బయపడ్డా ఆ తల్లీకూతుళ్లను కామాంధులు కాటేశారు. వరదల్లో చిక్కుకొని నిరాశ్రయులుగా మారారన్న కనికరం కూడా లేకుండా ఆ దుర్మార్గులు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం వారిని దారుణంగా హతమార్చారు.
ఉత్తరాఖండ్‌లోని పాండుకేశ్వర్ సమీపంలోని కొండలపై చిక్కుకున్న యాత్రికుల కోసం గాలింపు చేపడుతున్న ఆర్మీ బృందాలు మంగళవారం వీరి మృతదేహాలను గుర్తించాయి.
వరదల్లో చిక్కుకోవడంతో ఈ తల్లీకూతుళ్లు పదిరోజుల పాటు బద్రీనాథ్‌లోనే తలదాచుకున్నారు. హెలికాఫ్టర్ ద్వారా తరలింపు ఆలస్యం అవుతుండటంతో సోమవారం కాలినడకన జోషిమఠ్‌కు బయలుదేరారు.
పాండుకేశ్వర్ సమీపంలో వీరిని అడ్డగించిన కామాంధులు రోడ్డు పక్కన ఉన్న పర్వతాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి వారి వద్ద ఉన్న డబ్బు, నగదును దోచుకెళ్లారు.
సోమవారం వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు. లాంబాగ్డ్ వద్ద తాత్కాలిక తాళ్ల వంతెన నిర్మించడంతో ఈ తల్లీకూతుళ్లు సోమవారం కాలినడకన జోషిమఠ్‌కు బయలుదేరారు. దారి మధ్యలో దుర్మార్గుల చేతిలో బలయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు అక్కడి పరిస్థితులు, ప్రాథమిక ఆధారాలను బట్టి వీరు సామూహిక అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు.
రెండు మృతదేహాలను గోవింద్‌కుండ్‌లోని తాత్కాలిక హెలిప్యాడ్ నుంచి డెహ్రాడూన్ తరలించారు. ఈ తల్లీకూతుళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఘాతుకానికి పాల్పడింది ఎవరన్న అంశాలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన ఆర్మీ, ఐటీబీపీ బలగాలు ఇకపై కాలినడకన వచ్చే వారిని ఒకరిద్దరుగా కాకుండా గుంపులుగా పంపాలని, ప్రతి గ్రూపుతో ఓ సాయుధ సిబ్బందిని పంపాలని నిర్ణయించాయి.
Tags: News, Telugu News, Andhra News
0 comments:
Post a Comment