Digvijay Singh




ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్ నియామకంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉన్న డిగ్గీరాజా రాకతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారని వారు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణలో నక్సలిజం ప్రబలుతుందని, మరో ఛత్తీస్‌గఢ్ అవుతుందని పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో దిగ్విజయ్‌సింగ్ పలుమార్లు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీయే శరణ్యమని చెప్పే డిగ్గీరాజా తెలంగాణ విషయంలోనూ అదే ఫార్ములాను అమలు చేయాలని చెబుతున్నారు. దీంతోపాటు అవసరమైతే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ రాకతో తెలంగాణ వాదాన్ని గట్టిగా విన్పిస్తున్న తమకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘దిగ్విజయ్ నియామకంతో హైకమాండ్ తెలంగాణకు వ్యతిరేక సంకేతాలు పంపినట్లు కన్పిస్తోంది. ఎందుకంటే ఆయన తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి. సీమాంధ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. హైకమాండ్ ఇప్పటికే తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే దిగ్విజయ్ చేసేదేమీ ఉండదు. అలాకాకుండా ఇంకా అటు ఇటుగా ఉంటే మాత్రం ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు’ అని పేర్కొన్నారు.


Tags: News,Telugu News, AP News,

0 comments:

Post a Comment

 
Top