ఉత్తరాఖండ్ వరదలతో ఉత్తరాది అతలాకుతలమై పది రోజులు దాటింది. సైన్యం నిద్రాహారాలు మాని చర్యల్లో తలమునకలై ఉంది. నేతలు అలా వచ్చే పరామర్శించి ఇలా వెళ్లిపోతున్నారు. అయినా, పూర్తిస్థాయి సాయం మాత్రం అందటం లేదు.
ఇంకా వేలాది మంది యాత్రికులు కొండల్లోనే చిక్కుకుని ఉన్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రకృతి సహకరించకపోవడం.. పెద్ద సమస్యగా మారింది. ప్రతికూల వాతావరణానికి హెలికాప్టర్ కూలి 20 మంది మృతిచెందినా.. సైన్యం మాత్రం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూనే ఉంది.
రోజుల గడుస్తున్నాయ్. గడియారంతో పోటీపడుతూ సైన్యం నిర్విరామంగా పనిచేస్తోంది. కేదారీనాథ్ నుంచి బాధితులను తరలిస్తున్నా MI-17 V5 హెలికాప్టర్.. ప్రతికూల వాతావరణం కారణంగా గౌరీకుండ్ వద్ద కుప్పకూలింది.
వైమానిక, పారామిలటరీ సిబ్బందితో సహా మొత్తం 20 మంది మృతిచెందారు. ఘటనపై ప్రధాని మన్మోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హెలికాప్టర్ కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విచారణకు ఆదేశించింది.
కానీ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య సైన్యం అలుపెరగకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. అలాగే హెలికాప్టర్లు వెళ్లలేని చోటు నుంచి కూడా సైన్యం యాత్రికులను రక్షిస్తున్నారు.
సైన్యం అలుపెరగకుండా సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ.. మరో 72 గంటల్లో భారీ వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక గుండెల్లో గుబులు రేపుతోంది.
వర్షాలు పడకుంటే మూడు రోజుల్లో సహాయ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది. సహాయ కార్యక్రమాల తీరుపై సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. మరి వరుణ దేవుడు సహాయక చర్యలకు కరుణిస్తాడో లేదో వేచి చూడాలి.
Tags: News, Telugu News, Andhra News,
0 comments:
Post a Comment